Darbha Babu Rao

ఊరేగింపు

10 July 2026

పొద్దున్నే....అంటే ఇంకా నేను దంతధావనం కూడా చేసుకోకముందే ‘సున్నారావ్‌’....సారీ...పున్నారావ్‌ మా కొంపమీదికి ఓ నలుగురైదుగుర్ని వెంబడేసుకుని ‘గురువు గారూ, మీతో చిన్న పనిపడింది’ అంటూ తగలడ్డాడు. ఏం చేస్తాం? మా ఇల్లుని ‘కొంప’ అనుకోవటమూ....వచ్చిన ఆప్తమిత్రుడు పున్నారావుని సున్నారావని తల్చుకోవడమూ తగలడ్డాడని భావించటమూ...అన్నీ కొంచెం బాధగానే అనిపించాయి. కానీ సదరు పున్నారావు పూర్వాశ్రమంలో నా క్లాస్‌మేట్‌. ఏదో పరీక్షలో సున్నా మార్కులు రావడంతో అతగాడికి ‘పున్నారావు’కి బదులు ‘సున్నారావ’నే ముద్దు పేరు స్థిరపడిపోయింది. ఒకవేళ యథాలాపంగా నోరు జారి అతనిని సున్నారావని సంబోధించినా...అతను నవ్వి ఊరుకుంటాడేతప్ప పెద్దగా బాధపడడు. బహుశ అతని ముద్దుపేరు అతనికి కూడా ముద్దుగానే ఉంటుందేమో...ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడుగానీ కోపగించుకోడు. అసలైనా అతను ఆనాడు ‘సున్నా’ మార్కులొచ్చి తప్పి ఉండకపోతే నాలాగా పెద్ద చదువు చదివేసి ఓ పంతులు ఉద్యోగం సంపాదించి చాలీ చాలని జీతాలతో దమ్మిడీ పై సంపాదన లేక లోనలొటారం పైన పటారం’గా పైకి కనబడే దర్జాగా బతుకు వెళ్ళదీయాల్సొచ్చేది. తను ఆనాడు పరీక్షు గట్టెక్కలేకపోవటం జీవిత పరీక్షలో మెట్లెక్కడానికే దారి తీసిందని తెగ సంబరపడిపోతుంటాడు పున్నారావు. లేకపోతే ఇంత ప్రయోజకుడై...బిల్డర్‌ కమ్‌ కాంట్రాక్టర్‌ అయిపోయి ట్రాక్టర్లూ, కార్లూ, ప్లాట్లూ, ఫ్లాట్లూ కొనటం, అమ్మటం ద్వారా మేడలూ మిద్దెలూ కట్టేసి యం.ఎల్‌.ఏ. కాకపోయినా ఎమ్మెల్యే పంచె, జరీ కండువా ధరించి ఓ చిన్న సైజు మినిస్టర్లాగా పది మంది హంగుల జనాన్ని వెంటేసుకుని చెంగుచెంగున ఊరంతా కలియదిరిగేస్తూ చాలా మందికి తల్లో నాలుకలా...అఫ్‌కోర్స్‌...కొంత మందికి మాత్రం.... తలకాయ నొప్పిలా తల మీది బొప్పిలా దర్జాగా దర్పంగా మెలిగి వెలిగిపోవటం సాధ్యమయ్యేదా? ఈ బుల్లి ఊళ్ళో అతను తల్చుకుంటే కాని పనంటూ లేదు. ఆ మాటకొస్తే ‘కాని పనులు’ కూడా తప్పకుండా అయితీరతాయి. ఇంతకీ అతనొచ్చిన పనేంటో....ప్రత్యేకించి అతను నా మీదే ఎందుకు దాడిచేశాడో కనుక్కోవాలనే ఆదుర్దాతో దంతధావనం కార్యక్రమానికి ప్రస్తుతానికి స్వస్తి చెప్పి పాచి పళ్ళతోనే అతని ప్రపోజల్‌ విన్నాను. ఆ వచ్చిన వాళ్ళని కూడా లోపలకి పిలవమని పున్నారావుతో అన్నాను. ఇంట్లోంచి నాలుగు కుర్చీలు తేబోయాను. ‘ఇదుగో నాకు కుర్చీలు, కాఫీులు ఏంవద్దుగానీ...ఆళ్ళాడే ఉంటార్లే....నువ్వు ముందు లోపలకి పద. నీతో రగస్యంగా మాట్లాడాలి’ అని నన్ను హాల్లోకి తీసుకొచ్చి... వాడి మందీ మార్బలాన్ని వాకిట్లోనే ఆగి ఉన్న టాటా సుమోలో కూర్చోమని సైగ చేశాడు.

నా చేతులు పట్టుకుని వాటిని ‘కాళ్ళ’ని వాచ్యంగా చెప్పకపోయినా అంత ఎక్స్‌ప్రెషనూ పెట్టేసి ప్రాధేయపడుతూ వాడి ప్రపోజల్‌ కక్కేశాడు. ‘నువ్వు కాదంటే వల్ల కాదు’ అని గట్టిగా నొక్కి వక్కాణించాడు. వాడి ప్రపోజల్‌ కాదంటే ఏంజరుగుతుందో చూచాయగా నేను ఊహించేశాను. అంటే వాడు నన్నేదో చేసి పారేస్తాడని మీరు అపోహపడుతున్నారు కాబోలు. అదేం కాదు. సున్నారావు...అదే పున్నారావు...టాటా సుమోలో తన హంగుగాళ్ళని వెంటేసుకుని తిరిగినా, అందులో కాసినో కూసినో ప్రహరణాయుధాలు కూడా ఉండినా ఉండకున్నా వ్యక్తిగతంగా మరీ అంత రౌడీ ఏం కాదు. పైగా నాకు ఆప్తుడే కనుక మీరు ఊహించినట్లుగా ఇది బ్లాక్‌మెయిల్‌, దౌర్జన్యంలాంటి పథకం మటుకు కాదు. కనుక అతని ప్రపోజల్‌ని నేను అవునన్నా కాదన్నా నన్ను ఏమీ అనడు...అనలేడు....ఏమీ చేయలేడు...చేయడు. కాకపోతే నేను కాదంటే మరొకరి ద్వారా ఆ పని సాధించుకు తీరతాడు. అందుకని గిరీశం లాగా అతనికి పనిచేసి పెట్టినందువల్ల డెబిట్లూ, క్రెడిట్లూ బేరీజువేసుకుని వెరశి ‘నిల్‌ బాలెన్స్‌’ అని తేల్చుకుని కేవలం ఒక స్నేహితుడి ముచ్చట తీర్చటం కర్తవ్యంగా భావించి అతను అప్పజెప్పిన పనికి ‘అలాగే’ అనేశాను.

ఇంతకీ అసలు విషయం ఇది.... పున్నారావు కొడుకు....డబ్బుతో పుట్టి డబ్బులో పెరిగి డబ్బుల్తో తిరిగి పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ బుద్ధి మాత్రం ఎదగలా. కనుక బుద్ధిగా చదువుకుందామనే బుద్ధి కలగలా. ఓ నిక్షేపంలాంటి కళాశాలలో చేరినా తను చెడి వెంట తిరిగే పదిమందిని చెడగొట్టినా...చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి తెచ్చుకుని ఓ రెండు సంవత్సరాలు కాలక్షేపం చేసి...ఆ రెండు సంవత్సరాలు ‘ఇంటర్‌ ఈడియట్‌’ అయిందనిపించింది చాలక మరో రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం షార్ట్‌ టరమూ, మరో సంవత్సరం లాంగు టరమూ ఎమ్‌సెట్‌ కోచింగు కోర్సుల్లో చేరి వాళ్ళ నాన్నకు ఓ ‘ల’కారం దాకా ‘ఓం’కారం చుట్టాడు. చిట్టచివరకు ఉన్న ఊళ్ళోనే నూతనంగా స్థాపించబడిన ఓ బుల్లి రెసిడెన్షియల్‌ కళాశాలలో చేరి ఓ ర్యాంకు సాధించాడు. ఎన్నేళ్ళ తరువాత అనిగానీ ఎన్నో ర్యాంకు అనిగానీ నన్ను అడగొద్దు. చెప్పడం బావుండదు. ఇతడి ర్యాంకుకు చదువూ సంధ్యా శ్రద్ధగా చెప్పగలిగిన అధ్యాపకులూ, వానకీ వంగుడుకీ లొంగని పక్కా భవనము లేక ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలోను అనుకున్న బ్రాంచిలో సీటు రాదనేది (ఎన్ని కౌన్సిలింగులు జరిగినా) మటుకు నాది హామీ. ఇంక పున్నారావు సమర్ధత, పులుకుబడి, డబ్బు ** జడీ ** దృష్ట్యా తామరతంపరగా పెరిగిన పెరుగుతున్న ఏ పల్లెటూరి పాక కాలేజీలోనో నూతనంగా స్థాపించబడి నామమాత్రంగా సాగబోతున్న ఏ కొత్త కాలేజీలోనో...డిమాండు తక్కువగా ఉన్న బ్రాంచిలో సీటు కొనుక్కోవటానికిమటుకు ఈ ‘బడుద్ధాయి ర్యాంకు’ సరిపోవచ్చు.

ఏది ఏమైనా పున్నారావు పుత్ర రత్నం సాధించిన ర్యాంకు మటుకు టౌను (విలేజి) ఫస్టు. మనలో మాట. ఆ విలేజి ద్వారా సాధించిన ర్యాంకులో వీడిదే ఉత్తమ ర్యాంకు(ట). ‘వీడి ర్యాంకు పిండా కూడుగానూ... నా ప్రాణం మీదికి తెచ్చాడు. నానా యాగీ చేస్తున్నాడు... ఇప్పటిదాకా నమిలి మింగిన లక్షన్నరా చాలక నన్ను కూడా మింగాలని చూస్తున్నాడు నాకొడుకు’ అంటాడు పున్నారావు. వాడికి ఘనంగా ఊళ్ళో ‘ఊరేగింపు’ జరపాలిట. పాతిక ముప్పయి ఖర్చయినా పరవాలేదట. పాతిక రూపాయలు కాదండీ బాబూ పాతిక ** మే....మే...’ ** అంటూ వేళ్ళు చూపించాడు పున్నారావు. ఊరేగింపు జరగకపోతే ఉరేసుకు ఛస్తానంటున్నాడు ఏం చేస్తాం చెప్పు. ఉరేసుకు చావడం కంటే ఉరేగింపు చేసుకుని దిష్టి తగిలి చావటమే బెస్ట్‌ అని అభిప్రాయపడ్డా. వాళ్ళమ్మ కూడా వత్తాసు పలికి ‘డబ్బేం చేసుకుంటా...నెత్తినేసి కొట్టుకుంటా....కొడుకు ముచ్చట తీర్చనికాడికి ఎందుకూ నీ ఎదవ సంపాదన? ఏడవనా?’ అని ఏడుపు మొదలెట్టింది. అది కూడా ఉరేసుకుంటానంటే ఇద్దరి ఉరుల మధ్య ఉక్కిరిబిక్కిరై నేను ఉరేసుకోవాల్సొస్తుందని ఒప్పుకోక తప్పలేదు. ఎవడితోనన్నా ఈ విషయం చెప్పుకుంటే సిగ్గుచేటు. అందుకని నీతోనే సిగ్గిడిసి జెబుతున్నా...నువ్వే ఈ ఏర్పాట్లు చూడాలి....నాకీ సహాయం చెయ్యాలి’ అంటూ ప్రాధేయపడ్డాడు పున్నారావు. ‘ఏమిటీ? మీవాళ్ళు ఉరేసుకునే ఏర్పాటుచెయ్యాలా?’ అన్నాన్నేను ఆశ్చర్యంగా....భయం భయంగా. ‘ఛస్‌! ఉరి ఏర్పాట్లు కాదయ్యా, ఊరేగింపు ఏర్పాట్లు’ అన్నాడు పున్నారావు. అడ్డమైన వాళ్ళకీ సన్మానాలూ, సభలూ, సమావేశాలూ... నిఠారుగా చచ్చిన వాళ్ళకి సంతాప సభలూ అన్నీ నిరహించేది నువ్వేగా ఈ ఊళ్ళో. అందుకనే నాకీ హెల్ప్‌ చేసి పెట్టాల. అర్జెంటు...డబ్బుకి ఎనకాడమాక. మా జనాభానంతా నీ ఎనకమాల పంపుతా. కానీ ఉరేగింపు ఘనంగా జరగాల. కావసినన్ని లారీలూ, టాక్సీలూ పిలిపిస్తా. నువ్వు కాదనమాక’ అంటూ ఓ నోట్ల కట్ట నా చేతిలో పెట్టాడు. నాకు నోట మాట రాలా. నోరు పెగల్చుకునేటప్పటికి పున్నారావు అయిపూ అజా లేడు. ‘ఏ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఏ ఫ్రెండ్‌ ఇన్‌ డీడ్‌’ అన్నారుగదా ఇంగ్లీషు పెద్దలు. చేయించుకునే వాడికీ చేయించే వాడికీ లేని సిగ్గు నడిపించేవాడికి నాకెందుకూ....అనుకుని సరిపెట్టుకున్నా.

ఓ ‘బడుద్ధాయి’కి ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. తప్పెట్లు తాళాల మోతలో అతనికొచ్చిన ర్యాంకు ఎంతో ఎవరికీ అంతుబట్టలేదు. ర్యాంకు గొడవలు తెలియని పల్లెలాంటి పట్నంలో మన పున్నారావు కొడుకంటయ్యా... నలభై వేలో యాభై వేలో ర్యాంకు తెచ్చుకున్నాడంట అని ఒకడంటే...తాగిన మైకంలో ఆస్‌...పో...అసె.... మన పున్నారావు తలుసుకుంటే యాభై ఏలేందీ....వందేలో, వెయ్యేలో తెప్పించడూ....అంటున్నాడు మరొకడు. ఊరేగింపుకి స్క్రీన్‌ప్లే నేనే రాసినా సీన్లో మటుకు కనిపించలా. ఊరేగింపు నాలుగు రోడ్ల కూడలికొచ్చేసింది. పున్నారావు పెంచి పోషించిన గులాములు సలాము చేసుకుంటూ ఒళ్ళంతా గులాం పులుముకుంటున్నారు. ఓ కార్నర్‌లో ఉన్న కాకా హోటల్‌ పాకలో పి.జి. చదివి.. ** మీనియల్‌ ** సర్వీస్‌కి మనసొప్పక మినీస్టీరియల్‌ ఉద్యోగం రాక ఎవరో ఇప్పించిన ‘ఉచిత టీ’ ఊదుకుంటూ తాగుతున్న ఓ నిరుద్యోగి చిరునవ్వు నవ్వుతూ...ఊరేగింపు కనుమరుగయ్యేదాకా చూసి చివరగా ఓ నిట్టూర్పు విడిచాడు. అది నాకు ‘శభాష్‌’ అన్నట్లుగా అనిపించింది.