అనుకున్నంత తేలిక కాదు… అపార్డుమెంటు కాపురం
10 July 2026
ఐదారు అంతస్తులపై నుంచి చుట్టుపక్కల బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న చిన్న చిన్న డాబా ఇళ్ళనూ, పెంకుటిళ్ళనూ పరికించి చూస్తూ బొమ్మల కొలువు చూసినంత సంబరపడిపోవాలని ఉవ్విళ్ళూరుతూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటుంది మా ఆవిడ. అంత ఎత్తున నివసిస్తూ అందరికన్నా ఉన్నతంగా ఉన్నామన్న భావనే ఓ అందమైన ఊహ. సిటీలో స్టైలిష్‌గా ఉండే అపార్టుమెంట్స్‌లో ఓ ఫ్లాట్ కొనుక్కుని కాపురం వెలగబెడితే ‘భేషుగ్గా’ ఉంటుందని కలవరిస్తూ ఉంటుంది. కలవరింతలు పలవరింతలు ఎక్కువైనకొద్దీ నన్ను సతాయిస్తూ ఉంటుంది. నాకైతే సుతరామూ ఇష్టంలేకపోయినా ఆవిడ అభిప్రాయాన్ని కాదని ఎన్నాళ్ళు నెట్టుకు రాగలను...నెగ్గుకు రాగలను? అందుకనే శాంపిల్‌గా నాలుగైదు అపార్ట్‌మెంట్స్ పరిశీలించి వచ్చాక కొనుక్కునే ప్రయత్నం చేద్దామని ఆవిడకి నచ్చజెప్పి బయల్దేరేసరికి నా తల ప్రాణం చివరి వెన్నుపూసలోకొచ్చింది. నాకు తోక లేకపోబట్టి సరిపోయిందిగానీ...లేకపోతే తోకలోకి వచ్చేదే.
‘దూరపు కొండలు నునుపు’ అన్న సామెతగా దూరం నుంచి చూస్తుంటే అపార్టుమెంటు బిల్డింగులు అందంగానే కనిపిస్తాయి. కానీ అందులో అడుగుపెట్టి కాపురం వెలగబెడితేగానీ కష్టనష్టాలు తెలిసిరావు. అపార్టుమెంట్స్ ముందు ఆటో దిగి ఆరేడు అంతస్తులున్న ఆ భవనాన్ని ఆసాంతం పరికించాలని మేం కన్న కలలకు ఆదిలోనే హంసపాదు పడింది. పై అంతస్తుని పరికించాలంటే మెడ నరం పట్టుకునేటట్లు పైకి చూడాల్సొచ్చింది. హాయిగా వెల్లికిలా పడుకుంటేగానీ స్పష్టంగా పై అంతస్తు కపపడదని తెలిసొచ్చింది. కానీ అలా బిల్డింగు ముందు రోడ్డు మీద వెల్లికిలా పడుకుంటే జనం పోగై మూర్ఛపోయామని భ్రమపడి నీళ్ళ బిందె నెత్తిన కుమ్మరిస్తారేమోనని అనుమానమొచ్చి ఆగిపోయాం.
ఆ మాటే మా ఫ్రెండుతో అంటే ‘నీకా భయమేం అక్కర్లేదు. మీ నెత్తిన కుమ్మరించటానికి చాలినన్ని బిందె నీళ్ళు ఇక్కడ దొరకవుగాక దొరకవు. మహా అయితే తలా ఒక చెంచాయో, గ్లాసో నీళ్ళు త్యాగం చేసి ఒక్క బిందె పోగు చేయొచ్చు. అదైనా అసోసియేషన్ మీటింగు పెట్టుకుని నిర్ణయించుకుంటేనే సాధ్యం. అది జరిగే లోపల నీకు నీళ్ళవసరం ఎలాగూ ఉండకపోవచ్చు’ అని జోక్ చేశాడు.
ఏం చేస్తాం?అపార్టుమెంటు కాపురాల వాళ్ళకు గాలీ, నీరూ కూడా కరువేనట. తేమ మాత్రం పుష్కలం అట. ఆ సంగతి నేనూ మా ఆవిడా వెళ్ళిన మొదటి రోజే గ్రహించేశాం. బాత్‌రూమ్‌కెళ్ళి హాయిగా స్నానం చేద్దామని పంపు తిప్పితే నీళ్ళు రాకపోగా ‘జుయ్’మని శబ్దం వచ్చింది. అక్కడ పెట్టి ఉంచిన ఒకటీ రెండు బక్కెట్ల నీళ్ళూ మేం ఖాళీ చేసేసి, స్నానం అయిందనిపించుకున్నాం. అది తెలిసి మా మిత్రుడు ఏడవలేక నవ్వుతూ ‘నో ప్రాబ్లమ్’ అన్నాడుగానీ తనూ తన కొడుకూ కలిసి స్కూటర్ మీద ఖాళీ బిందె తీసుకెళ్ళి, గంట తర్వాత ఎక్కడినుంచో నీళ్ళు మోసుకొచ్చి బక్కెట్లు నింపుకోవడం కళ్ళారా చూసి జాలిపడకతప్పలేదు మాకు. ఆ పూట ‘నీళ్ళ కోటా’ అంతవరకేనట మరి. ఉండటానికి పంపుూ, సంపుూ అన్నీ ఉన్నాయిగానీ అసోసియేషన్ రూల్సు ప్రకారం అన్నింటికీ ‘టైమ్ టేబుల్’ ఉంటుందిట. ఉండటమే కాదు, అది రైల్వే టైమ్ టేబుల్‌లాకాక ‘స్ట్రిక్ట్’గా అమలు జరుగుతుందిట. పొద్దునో గంటా...సాయంత్రమో అరగంటా మాత్రమే నీళ్ళు వదలటానికి నిశ్చయంచుకున్నారట. ఆ నిశ్చిత సమయంలోనే స్నానపానాదులన్నీ ముగించుకుని తీరాల్సిందే. ఆ తరువాత అరిచి గీపెట్టినా ‘చుక్క’ నీళ్ళు కూడా దొరకటం దుర్లభం. ఆ కాసేపూ మాత్రం ‘చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా’ అన్నట్లు డ్రమ్ములో...బక్కెట్లో నింపుకున్న వాడికి నింపుకున్నంత మహదేవా అన్నమాట.
సరే... నీటి సమస్య మాట దేముడెరుగు. ఉచిత వస్తువైన గాలన్నా హాయిగా పీల్చుకోవచ్చునుకుంటే...అదీ ఓ సమస్యే. చాలా మధ్య తరగతి అపార్టుమెంట్ ఫ్లాట్లకి ముందు తలుపు ఒక్కటే ఉంటుంది. ఫ్లాట్‌కి ఇరుప్రక్కలా ఇరుగుపొరుగు ఫ్లాట్లుంటాయి. వెనకవైపున ఒకటీ...అరా..కిటికీ ఉండే ఉండొచ్చు. ముందు తలుపూ, వెనక కిటికీ బార్లా తీసి ఉంచితేగానీ లోపకి గాలి దూరటం సాధ్యంకాదు. ఫ్రీగా ప్రవేశించి మనల్ని స్పృశించి హాయిగా నిష్క్రమించటానికి గాలి దేవుడికి వీలుండదు. రెండింటినీ తీసి వుంచటం మనకు వీలుండదు. ముందు తలుపు బార్లా తీస్తే గాలి జొరబడటం మాట అటుంచి దొంగు జొరబడటమో...అటూ ఇటూ తిరిగే వాళ్ళు తొంగి తొంగి చూసిపోవడమో జరిగి మన కాపురం బజార్న పడొచ్చు. అందుకని ఎల్లవేళళా ముందు తలుపు మూసి ఉంచక తప్పదు. వెనక తెరిచిన కిటికీలోంచి లోపలికెళ్ళినా డోర్‌లోంచి బయటికెళ్ళే దారి లేదు గనక వెళ్ళిమటుకు ఏం లాభం? అని ‘గాలి దేవుడు’ నిరాశచెంది బయటి నుంచి బయటికే వెళ్ళిపోయి, కిటికీలోంచి తొంగికూడా చూడడు. కనక పొద్దుగూకులూ గుర్రుగుర్రుమంటూ ఫ్యాన్లు...రెక్కు నొప్పిపుట్టేట్లు తిరిగి తిరిగి అరిగిపోవలసిందే...కరెంటు బిల్లు పెరిగిపోవలసిందే. నిలకడగా ఉన్న కొద్ది గాలినే కవ్వం చిలికినట్లు చిలికి ఫ్యాన్లు...వేడి పుట్టించి చిరాకు పుట్టిస్తాయితప్ప హాయిగా ఊపిరి పీల్చుకోటానికి కూడా వీలుండదు.
గాలీ, నీరూ సమస్యలిలా ఉంటే...తేమ సమస్య మరొహటి. మొజైక్ ఫ్లోరింగ్ వల్లనయితేనేం...తూములూ గట్రా లేనందువల్లనయితేనేం...ఇల్లు కడిగితే నీళ్ళు బాల్కనీలోంచి బయటకి వెళ్ళి ఎవడి నెత్తినో అభిషేకం చేసి మనకు వాడు సహస్ర నామార్చన చేస్తాడనే భయంవల్లనయితేనేం...పండగకూ పబ్బాలకూ కూడా ఇల్లు కడగడం శూన్యం. తడి గుడ్డతోనే తుడుచుకుని మనం సోఫాలూ, కుర్చీలూ ఎక్కి కూర్చుని ఫుల్ స్పీడ్‌తో ఫ్యాన్లు వేసి గచ్చు ఆరేదాకా జపం చేయాల్సిందే. అంత చేసినా ఏదో ఒక మూల గాలిబారక నేల తడి వదలక తేమ ‘నిత్యమై’ కూర్చుంటుంది. ఏమరుపాటున మనం కాలు జారిపడడం ‘సత్యమై’ కూర్చుంటుంది. ఏతావాతా అపార్టుమెంటు గచ్చుపైన తేమ ‘నిత్య సత్యం’ అన్న మాట.
కాస్త ముగ్గూ ముచ్చటా గల ఇల్లాళ్ళకూ, మడీదడీగల మగవాళ్ళకూ అపార్టుమెంటు కాపురం అయోమయమూ అస్తవ్యస్తమూనూ. తడి బట్టలూ, మడిబట్టలూ ఆరేసుకునే సౌకర్యం అస్సలుండదు. లిక్కిడంత వెనక బాల్కనీలో మేకు కొట్టుకుని తీగలు బిగించుకుని తడిబట్టలు ఆరేసుకోవాల్సిందే. వాటికి క్లిప్పులు బిగించడం గనక మరిచిపోతే అవి తొందరపడి ఆరిపోయి జారిపోతే కిందపడి పోతే ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ’ అనుకుని ఉసూరుమంటూ పాట పాడుకోవసిందే.
అందుకనే ఏ అపార్టుమెంటు బిల్డింగు సౌందర్యమైనా ముందునుంచి కంటే వెనకనుంచి చూసి తీరవలసిందే. వెనక బాల్కనీలో ఆరేసిన లంగాలూ, లుంగీలూ, చీరలూ, జాకెట్లూ, వగైరా వగైరా వస్త్ర సముదాయంతో కళకళలాడుతూ కన్నులపండువగా ఉంటుంది. ఏదో అంతర్జాతీయ కాన్ఫరెన్సుప్పుడు ఎగరేసిన దేశదేశాల రంగు జెండాలను తలపుకుతెస్తుంది. ముగ్గూ ముచ్చటలెలాగూ లేవుగనక ముద్దూ మురిపెంగా మొక్కలు పెంచుకుందామనుకున్నా స్పేస్ ప్రాబ్లమ్‌తో కారిడార్లలో కుండీలో క్రోటన్లు పెంచుకోవలసిందే. దానికి కూడా సవాలక్ష ప్రాబ్లమ్స్. కారిడార్లు ఒకరికెక్కువా... ఇద్దరు నడవటానికి తక్కువా... అన్నట్లుంటాయి. దారి చాలక ఎవడైనా కుండీలను తన్నుకుంటూ పోవచ్చు. కుండీ పగిలి క్రింది అంతస్తు వాళ్ళ నెత్తి మీద పడి మన నెత్తి మీదకు నేరం రావచ్చు. కుండీలో నీళ్ళు కొలత ప్రకారం పొయ్యకపోతే పొర్లిపోయి, మట్టి నీళ్ళ చుక్కలు జారిపడి కింద వెళుతున్న గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ చొక్కాకు మరకు పడి మన ప్రవర్తనకు మచ్చ తేవచ్చు. వెనకా ముందూ వాడుకోవటానికి వసతి తక్కువ గనక ముందు డోర్ బిడాయించుకుని కుశలమైన హాల్లోనే అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలి. పిల్లా పీచూ ఉన్నారంటే వాళ్ళకు స్కూళ్ళల్లో ఎలాగూ స్వేచ్ఛ ఉండడంలేదు గనక ఇంట్లోనన్నా హాయిగా స్వేచ్ఛగా కాలక్షేపం చెయ్యొచ్చనుకుంటే...ఆ ముచ్చటా తీరదు. పిల్లలు గట్టిగా బంతి ఆడితే కింది ఫ్లాట్ వాడి నెత్తిన సమ్మెట పోటులా వినపడి వాడు పైకొచ్చి మన మీద కలియబడచ్చు. పోనీ సంగీత సాధన చేద్దామంటే సౌండ్ ఇంతకు పదింతలుగా వినపడి పక్కవాళ్ళకు చిరాకు కలిగించి చివాట్లు తేవచ్చు. అందుకనే పిల్లలు స్వేచ్ఛ కోల్పోయి, ఆటా పాటా మానేసి టీవీకి గుడ్లప్పగించి దిగాలుగా కూర్చోకతప్పదు. మొన్న దీపావళికి టపాసులూ గట్రా కాల్చుకునే ముచ్చట కూడా హాల్లోనే తీర్చుకోవలసివచ్చి ముచ్చటైన గచ్చుకు మందు మరకు పడి రొచ్చు రొచ్చయిందని మనసు నొచ్చుకోక తప్పలేదట.
ఇంక పండగకూ, పబ్బాలకూ చుట్టపక్కాలొచ్చినప్పుడూ అతిథి మర్యాదలకోసం అప్పడాలూ వడియాలూ వేయించి పెడదామనీ... అవి తయారుచేసి ఆరబెట్టుకోవడానికి ఆఖరి అంతస్తు డాబా మీదకి ఎక్కి దిగాల్సివచ్చి కాళ్ళు నొచ్చుకున్నాయట మా ఫ్రెండు భార్యకి. ఈ మధ్య అపార్టుమెంటు ఓనర్లు ఆ సౌకర్యం కూడా దక్కనీయకుండా పైన ఓ పెంట్ హౌస్ వాళ్ళే నిర్మించుకుని కాపురముంటూ ఎవ్వరినీ పైకి రానీయడం లేదట. మొన్నామధ్య జరిగిన ఓ చిన్న సైజు ఫంక్షన్‌కి పది మందికి పంక్తి భోజనాలు పెట్టడానికి నానాయాతనలూ పడాల్సివచ్చిందట. పక్క ఫ్లాట్ వాళ్ళని పరిచయమున్నా లేకపోయినా భోజనానికి పిలిచి, వాళ్ళ తలుపు మూసే ఉంచమని చెప్పి కారిడార్‌లో విస్తళ్ళు వేసి వాళ్ళకీ మన వాళ్ళకీ కూడా భోజన కార్యక్రమం అయిందనిపించేసరకి ‘ఆయిలో ప్రాణం కోయిలోకొచ్చిందని’ వాపోయింది మా మిత్రుడి ఇల్లాలు.
అపార్టుమెంటు కాపురాలకు అన్నీ సమస్యలే. పోస్టుమేన్...పాలవాడు...పేపరువాడు మొదలైన అందరూ అన్ని అంతస్తులూ ఎక్కి దిగలేక ‘ఓ బొక్కెనకు చేంతాడు కట్టి కిందికి దించండీ...అందులోనే పాల ప్యాకెట్టూ, పేపరూ, ఉత్తరాలూ గట్రా వేస్తాం’ అంటారట. లిఫ్టు సౌకర్యం ఉన్నా కూడా దాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోరు. అది అక్కరకొస్తుందని ఎవ్వరూ నమ్మరు కూడా. లిఫ్టుకి మెకానికల్ ఫెయిల్యూర్సూ మాన్యువల్ ఫెయిల్యూర్సూ (కరెంటు ఫెయిల్యూర్స్ కాక) సర్వసాధారణం. అందువల్ల జీవితంలో ఉద్యోగంలో పొందలేని లిఫ్టుని ఈరకంగానన్నా ఉపయోగించుకుంటున్నారని మనం అసూయపడటానికి ఆస్కారం లేదు. జీవితంలో పైకొచ్చి గమ్యం చేరినవాడు కిందివాడిని పట్టించుకోని చందంగా లిఫ్టు ఎక్కి పై ఫ్లోర్‌లోకొచ్చిన వాడు దాని తలుపూ ఔటర్ మెష్ఫూ మూయడం మరిచిపోతే అది కిందికీ పైకీ కూడా కొరగాకుండా పోయి అక్కడే ఆగి ఊరుకుంటుంది. కింది వాడికి లిఫ్ట్ బటన్ నొక్కి నొక్కి ‘బొటన్’వేలు నొప్పి పుట్టాల్సిందే. విసుగుపుట్టి వాడు మెట్ల దారి పట్టిన తరువాతగానీ ఆ ఫలానా ఫ్లోర్ నుంచి ఎవడో లిఫ్టు ఉపయోగించుకుని కిందకి దిగడు. అందరూ చందాలేసుకుని లిఫ్ట్‌బాయ్‌నీ, వాచ్‌మెన్‌నీ, సర్వెంట్ బాయ్‌నీ ఏర్పాటుచేసుకున్నా వాళ్ళంతా ఎవరో భాగ్యవంతుడికి సిగరెట్టు పెట్టె తేవటానికో...‘కలిగినమ్మ’కు కూరలు తెచ్చిపెట్టటానికో ముచ్చటపడతారు తప్ప...విధీవిరామం లేకుండా విధి నిర్వహణ చేయరు (సామాన్యుల సంగతీ, అతీగతీ పట్టించుకోరు).
ఇంక పై ఫ్లోర్‌లో ఎవరికైనా ముసలీ ముతకాకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ సమయానికే లిఫ్టు ఆరోగ్యం కూడా చెడిపోతుందట. చేసేదిలేక మెట్ల మీద నుంచి ఆయనను ఒకరిద్దరు ‘అవ్వా అప్పచ్చీ’ వేసుకొని మోసుకొచ్చి డాక్టరుకు చూపించి మళ్ళీ పైకి తీసుకెళ్ళేటప్పటికి ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందిగానీ మోసిన వాళ్ళకు మోకాళ్ళనొప్పులూ నడుం నొప్పులూ తథ్యం. ఇంటింటి (ఫ్లాట్ ఫ్లాట్) సమస్యలు ఇలా ఉంటే పరస్పర సంబంధాల సమస్యలు మరో రకంగా ఉంటాయిట. మన దేశంలోని భాషాప్రయుక్త రాష్ట్రాలకు మచ్చుతునకలాగా ఒకే బిల్డింగులో వివిధ భాషలవాళ్ళూ, రకరకాల మనస్తత్వాలవాళ్ళూ కలిసివుంటారు. అందరూ కలిసిమెలిసి కలుపుగోలుగా ఉంటారని గ్యారంటీ లేదు. ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు ఏ పక్క ఫ్లాట్‌లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ ఉద్యోగ సద్యోగాలేమిటో ఎవరికీ పట్టదు. పక్క ఫ్లాట్ వాళ్ళు ఊళ్ళో ఉన్నారో లేదో కనుక్కుందామని పక్క ఫ్లాట్ వాళ్ళ తలుపు తట్టినా, బెల్లు కొట్టినా ‘ఏమో ఎవడికి తెలుసు? పోయి సోదడగండి’ అని మన వంక విసుగ్గా చూసి విసురుగా తలుపు మొహం మీదనే వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదంతే. ఇలానే పొద్దున్నే బయల్దేరి మరో ఫ్రెండు ఫ్లాట్‌కి వెళ్ళి వాడి కోసం వాళ్ళనీ వీళ్ళనీ అడిగి పరాభవం చెంది (భాష తెలిసినవాడు చెప్పలేక భాష తెలియనివాడు చెప్పింది అర్ధంకాక) చివరికెలాగో ఒకలాగు వాడు ఒక వారం క్రితమే ఫ్లాట్ ఖాళీచేసి వెళ్ళిపోయాడనీ కొత్త అడ్రసు ఎవరికీ తెలియదనీ తేల్చుకోవలసివచ్చింది. చేసేది లేక చెవులాడించుకుంటూ పబ్లిక్ టెలిఫోన్ బూత్‌కి వెళ్ళి వాడి ఆఫీసుకి ఫోన్ చేస్తే అరగంట తర్వాత మళ్ళీ చెయ్యమని రిసెప్షనిస్టు చెప్పింది. ఓ గంట అక్కడే పడిగాపులు పడిన తరువాత వాడే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వాడి కొత్త ఫ్లాట్‌కి తీసుకెళ్ళాడనుకోండి. ముందూ వెనకా, క్రిందా పైనా ఏదీ స్వేచ్ఛగా అనుభవించే వీలులేక, లక్షలు పోసి కొనుక్కున్న సొంత ఫ్లాట్‌లో కూడా పరాధీనంగా (భయంభయంగా) అద్దె బతుకులు బతకటం తప్పనిసరైపోయింది. అంతా మిధ్య అనుకుంటూ నడి మధ్య కాపురం వెలగబెట్టడం కంటే గత్యంతరం లేదు.
అపార్టుమెంటు కాపురమంటే....జనారణ్యంలో చేస్తున్న ఆధునిక అజ్ఞాతవాసమే మరి!