వడ్డన కూడా ఒక కళే
10 July 2026
మా మామయ్య గారు ఇప్పటికీ అంటూనే ఉంటారు, ‘తిరగమాతల కోరు పెద్ద కోడలికీ... పది మందిలో పేరు చిన్న కోడలికీ’ అని. ఎందుకా అని ఆలోచిస్తే దొరికిన సమాధానం ఇది... వంటింటికి అంకితమైపోయి పొగచూరో, మసి బారో, జిడ్డోడుతూనో పెద్ద కోడలు ముప్పతిప్పలూ పడి వంటకాలు చేసి పెడితే, చక్కగా తీరిగ్గా ముస్తాబై ముచ్చట్లు చెబుతూ మురిపెంగా వడ్డిస్తూ అతిథుల మెప్పులూ, మన్ననలూ పొందుతుంది చిన్న కోడలు. పైగా అతిథులు కూడా వడ్డించిన వాళ్ళకి ‘థాంక్స్’ చెప్పో ‘కంగ్రాచులేషన్స్’ చెప్పో వెళ్ళిపోతారుగానీ ‘వంటెవరు చేశార’ని మాటమాత్రం కూడా అనరు. ఇది ఈనాటి తీరు. కానీ అనాటి మాట వేరు. నలభీమాది పాకశాస్త్ర ప్రవీణులకే పేరు ప్రఖ్యాతులొచ్చాయి. వంటకాల రుచినీ, వంటవాళ్ళనీ మెచ్చుకున్నట్లు దాఖలాలున్నాయిగానీ, వడ్డించేవాళ్ళ ప్రసక్తే దొరకదు వెనకటి గ్రంథాల్లో. కనక ఈ ఆధునిక యుగంలో వడ్డనకున్న ప్రాముఖ్యం వంటకాలకి లేదని ‘ఘంటా’పథంగా ... కాదు కాదు... ‘వంటా’పథంగా చెప్పవచ్చు. అందుకనేగా పదార్థాలు పావుగంటదాకా రాకపోయినా, వచ్చినా మసక వెలుతురులో కనపడీ కనపడనట్లున్నా, ఏ.సి. రూము కారణంగా చల్లారిపోయినా, ఖరీదు ఘనంగానే ఉన్నా, పెద్ద పెద్ద రెస్టారెంటు మీద ఉన్న మోజు కాకా హోటళ్ళ మీద ఉండటం లేదు. రుచి మాట దేవుడెరుగు సర్వింగ్ నీట్‌గా ఉంటుందంటారు. సర్వ్ చేసేవాళ్ళు (సర్వేశ్వరులు) కూడా సినిమా హీరోల్లాగా డ్రస్సయి ఉంటూ ‘ఇంగ్లీషు’లో అడుగుతూ ‘తెలుగు’ పదార్థాలు తెస్తారు. టేబుళ్ళూ, ట్రేలూ, ఫోర్కులూ, చెంచాలూ, కత్తులూ, కఠార్లూ చేసే ‘మేజిక్కు’ సమ్మోహనాస్త్రమే గదా మనల్ని ట్రాప్ చేసి ‘ట్రిప్’ చేసి (అంటే ‘పడదోసి’ అని నా తెలుగర్థం) టిప్పులిప్పిస్తోంది! అందుకనే మనకున్న 64 కళల్లో ‘వడ్డన’ అనే కళను చేర్చకపోతే అది కూడా చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉందంటున్నాను. సరే... ఇక వడ్డన ‘ప్రాముఖ్యం’ మాట అలా ఉంచి... ‘ప్రావీణ్యం’ ప్రసక్తికి వస్తే రకరకాల వడ్డనా పద్ధతుల గురించి ముచ్చటించుకోవచ్చు
.
వంటింట్లోనో, భోజనాలింట్లోనో ఒకళ్ళూ అరా అతిథులకో, అభ్యాగతులకో, అయినవాళ్ళకో వడ్డించే ఆడవాళ్ళ టెక్నిక్ ఒక రకంగా ఉంటుంది. ఆవేల్టికి ఉన్న పదార్థాలనుబట్టీ... తినేవాళ్ళ తీరు తెన్నులనుబట్టీ... మనుషుల మనస్తత్వాలనుబట్టీ... రకరకాలుగా వడ్డన చెయ్యడంలో ఆడవాళ్ళదే అందెవేసిన చెయ్యి. పదార్థాలు తక్కువగా ఉన్నాయనుకోండి... కొద్ది కొద్దిగా వడ్డించడం, నోటితో చెప్పకుండా ఉన్న కాస్తా నీకే వేశానన్న దానికి సాక్ష్యంగా గిన్నె గీకి మరీ వడ్డించడం, వెచ్చాల కొట్టువాడు మనం అడిగిన వస్తువు లేదనకుండా ఉన్న వస్తువునే అంటగట్టటానికి చూసినట్లు... సమృద్ధిగా ఉన్న అయిటం తీసుకొచ్చి వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా వడ్డించేసి వెళ్ళిపోవటం లాంటి పద్ధతులు అనేకం అవలంబించవచ్చు. పద్ధతి ఏది అవలంబించినా ఆదరణ, ఆప్యాయతకు కొరవ ఉండదుకనుక అతిథులకు కూడా అసంతృప్తి ఉండదు.
అసలు అతిథులలో కూడా రెండు రకాల మనస్తత్వాలు కలవాళ్ళుంటారు. వీళ్ళని ‘నిర్మొహమాటస్తులు’, ‘మొహమాటస్తులు’ అని స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. నిర్మొహమాటస్తులైతే ఎవరి వడ్డన చాతుర్యమైనా ఏగానీకి కొరగాదు. అల్మారలో అబ్బురంగా దాచిపెట్టుకున్న ఆవకాయతోసహా అడిగిమరీ స్వాహా చేసి, వడ్డించేవాళ్ళకి సొడ్డు వేసి మరీ వెళ్ళిపోతారు.
ఇక ఎటొచ్చీ మొహమాటస్తులకే మనసు కనిపెట్టి, మనసుపెట్టి మాటలు చెబుతూ వాళ్ళకిష్టమైన పదార్థాలను మరీ మరీ అడిగి వడ్డిస్తూ అయిష్టమైన పదార్థాలను అంతంతమాత్రంగా వడ్డిస్తూ వాళ్ళు తృప్తిపడే విధంగా వడ్డించడంలోనే వడ్డన కళా చాతుర్యం తేటత్లెమవుతుంది. ఈ విషయంలో మా వదిన గారినే చెప్పుకోవాలి. ఎంతటి మొహమాటస్తుల చేతనైనా సరే కొసరి కొసరి వడ్డించిమరీ తృప్తిగా తినిపిస్తుంది. ‘ఇంక తినలేను లాభంలేదండీ’ అంటే... "భోజనం చేయటంలో కూడా ‘లాభనష్టాలు’ చూసుకుంటే ఎలాగయ్యా? నీ కామర్సు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదూ" అంటుంది. ‘అది కాదు వదినా, ఎక్కువయింది’ అంటే.. ‘ఎక్కువయింది ముందు తినెయ్... తక్కువయింది తరువాత తినొచ్చు’ అంటుంది. ఏ రకంగా మాట్లాడినా అన్నిటికి అన్నీ చెప్పి అనుకున్నవన్నీ (నేనుకున్నవి కాదు...ఆవిడ అనుకున్నవన్నీ) తినిపించక మానదు.
ఇది ఇంటింటి లేదా వంటింటి వడ్డన భాగోతమనుకుంటే... భారీయెత్తున జరిగే ఫంక్షన్లలోనో, పెళ్ళిళ్ళలోనో జరిగే వడ్డన విన్యాసాల్లో మహాభారత ఘట్టాలు స్ఫురించక మానవు. అన్నీ విపులంగా వినిపించాలంటే ‘చాటభారత’మంతవుతుంది. అదివరకటి రోజుల్లో అయితే, ప్రత్యక్షంగా వచ్చి పిలిస్తేనేగానీ జనం వచ్చేవాళ్ళు కాదు. వచ్చినవాళ్ళు కూడా కాస్త పెద్దా చిన్నా కనిపెట్టి, ముందూ వెనకా చూసుకొని వడ్డించాం రమ్మని పిలిస్తే వరసగా వచ్చి కూర్చునేవాళ్ళు, తీరిగ్గా తినేవాళ్ళు. చుట్ట పక్కాలో, చుట్టుపక్కవాళ్ళో తలా ఒక అయిటమూ అందుకుని అందరినీ అడిగి అడిగి వరసలు కలుపుకుని సరసంగా సక్రమంగా వడ్డించేవాళ్ళు. ‘ఏం బావా, ఒక్కటెయ్యనా?’ అని లడ్డూ చూపిస్తూ లడ్డూలాంటి మరదలు పిల్ల సరసంగా అడిగినప్పుడు, బావగారు సిగ్గుపడి చాలని చెప్పినా... ప్రక్కనున్న బాబాయిగారు ‘ఆడు ఒకటీ అరా వడ్డిస్తే మాట వినే రకం కాదు... నాలుగు వడ్డిస్తే గానీ లాభంలేదు’ అని వ్యంగ్యంగా అనటం, ‘ఏమయ్యా గరిట తిప్పడమేగానీ పులుసులోంచి ఒక్క ముక్కా బైటికి రాదేం?’ అని ఏ పెద్ద మనిషైనా వడ్డించే వాడి మీద విసురు విసిరితే... ‘ఆఁ పోదురూ, మీ దగ్గర్నుంచి మటుకు ముక్క బైటికి రావాలంటే మాటలా? మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళ పని ఆల్ కౌంటే’ అని ప్రక్క పెద్ద మనిషి పేకాట ముక్కల రిఫరెన్సు తేవటం, ఇలా రకరకాల సరస సల్లాపాల మధ్య సందడి సందడిగా జరిగే విందు పసందుగా ఉండేవి. వడ్డించటం కూడా సరదాగా ఉండేది. ఆదరణా, ఆప్యాయతలూ ఒలికిస్తూ నడ్డి వంచి అందరికీ వడ్డించినా అలుపూ సొలుపూ ఉండేది కాదు. అప్పటివాళ్ళే నిజమైన వడ్డన కళాకారులని చెప్పొచ్చు. వాళ్ళు ఒరిజినల్ ఆర్టిస్టుల్లాంటి వారు.
ఇక ఈ రోజుల్లో తినేవాళ్ళ తీరు తెన్నుల్లోనే మార్పులొచ్చేశాయి. ఎవరికీ తీరిగ్గా తినే ఓర్పూ లేదు, ఓపికగా వడ్డించే నేర్పూ లేదు. అంతా హడావిడే. వడ్డన మొదలెట్టేట్లున్నారో లేదో సి.ఐ.డి.ల్లాగా కనిపెట్టి కాస్త సూచన దొరగ్గానే టక్కన ఒకసీటు దొరకబుచ్చుకుని, విస్తళ్ళు వేసీ వేయకముందే కూర్చోవటం తప్పనిసరైంది. లేకపోతే ముందు వచ్చిన వాడికి ‘సీట్లు’ దొరకవు, వెనకబడ్డ వారికి ‘స్వీట్లు’ మిగలవు. ‘పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం తినటానికి’ అని తండోపతండాలుగా తోసుకొచ్చి ‘మ్యూజికల్ ఛైర్స్’ ఆట ఆడుకుంటున్నారు. దాంతో వడ్డించేవాళ్ళూ కంగారుపడిపోయి, విస్తళ్ళు వేసిన వాడిక గ్లాసు పెట్టకా, గ్లాసు పెట్టినవాడికి విస్తళ్ళు వెయ్యకా, గ్లాసు కోసం విస్తళ్ళకోసం వెర్రి కేకలేసుకుంటూ, కంగారుగా అటూ ఇటూ తిరగటం జరిగిపోతుంది. ఓ ప్లాను ప్రకారం వడ్డన చేయటం కుదరనే కుదరదు. వడ్డించడానికి కూడా వడ్డనలో అనుభవమూ ప్రావీణ్యం లేని వాళ్ళు వడ్డించడానికి తయారవడం జరిగి, అంతా ఆందోళనా కంగారూ హడావిడీ అయి, టైము వేస్టూ పదార్థాల వేస్టూ కూడా జరుగుతోంది. ఏది ముందు వడ్డించాలో, ఏది వెనక వడ్డించాలో, ఏది తక్కువ వడ్డించాలో, ఏది ఎక్కువ వడ్డించాలో, తెలిసీ తెలియని అమెచ్యూర్ వడ్డన కళాకారుల విచిత్ర విన్యాసాలవల్ల వండిన అన్ని అయిటమ్సూ అందరికీ అందటం అరుదైపోతోంది.
హోస్టు గారి మెప్పుకోసమో మెహర్బానీ కోసమో... నే వడ్డిస్తానంటే నే వడ్డిస్తాననీ, అవసరానికి మించినంత మంది వడ్డనకు దిగుతారు. వీళ్ళల్లో పప్పు బొక్కెన పట్టుమని పది నిమిషాలు మొయ్యలేని అర్భనాకారులూ... చెంచాతోనూ గరిటెతోనూ కరెక్టుగా కావలసినంత కూరో, పచ్చడో తియ్యటం చేతకాక తమ చొక్కా మీదో తినేవాడి చొక్కా మీదో కూర మరకలూ, పచ్చడి మరకలూ చేసే కంగారు ఆర్టిస్టులు... చిప్ప గరిటతో చక్కగా వడ్డించడం చేతగాని చిన్న సన్నాసులూ, ఆఖరికి మంచి నీళ్ళు కూడా గ్లాసులోని ‘వెలితి’ చూసి కావాలో అఖ్ఖర్లేదో గ్రహించి వడ్డించలేని బుద్ధ విగ్రహాలూ, అడిగినవి తక్కువా అడగనిది ఎక్కువా వడ్డించే అయోమయాలూ... ఇలా అనేక రకాల అమెచ్యూర్ వడ్డన ఆర్టిస్టులు అత్యంత ఉత్సాహంతో ముందుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు. వీళ్ళకు వడ్డనలో మెళకువలు తెలిసినా తెలియకపోయినా చొరవా, ఉత్సాహమూ, సేవాభావమూ ఉంటాయి. వీళ్ళకి నాబోటి వాళ్ళెవరైనా కాస్త వడ్డన శాస్త్ర పరిజ్ఞానం కలిగిస్తే ఉత్తమ వడ్డన కళాకారులు అయి తీరతారనటంలో ఏమాత్రం సందేహంలేదు. వీళ్ళు హోస్టు తాలూకు సిన్సియర్‌గా సహాయపడే మనుషులైతే, మరికొందరు గెస్టు ముందు మెహర్బానీ కోసం వడ్డన చేపట్టి షో చేయడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు కేకలేస్తూ అటూ ఇటూ గందరగోళంగా తిరుగుతూ సక్రమంగా వడ్డించేవాళ్ళకు అడ్డంపడటమే తప్ప పట్టు వదలకుండా పట్టిన పదార్థం విడవకుండా పట్టుమని ఓ పది మందికైనా డిసిప్లిన్డ్‌గా వడ్డించే పాపానపోరు. బంతిలో ఎవడైనా వి.ఐ.పి. తగిలితే వాడి దగ్గరకే అందరూ వెళ్ళి వడ్డించినవే మళ్ళీ మళ్ళీ అడిగి వాడికి ఊపిరి సలపనియ్యరు సరికదా, ప్రశాంతంగా ఏ ఒక్కటీ తిననియ్యరు. ఆయనగారు పప్పు కావాలంటే... పులుసు వడ్డించే కుర్రాడు మరొకణ్ణి కేకేసి ‘ఒరేయ్ పప్పూ... పప్పు పట్రా’ అని గొంతు చించుకుని కేకలేస్తాడు. కానీ వీడు మాత్రం వి.ఐ.పి. సీటు దగ్గర్నుంచి కదలనే కదలడు. ఇంకా ఆ లైనులో కూర్చున్న మిగతా సామాన్యులు ‘పులసు గతి ఇంతే... పప్పున్న మనిషికీ పులసు లేదంతే...ఏ...ఏ...హే..’ అని దు:ఖంగా పాడుకోవటం తప్ప గత్యంతరం లేదు. ఇక అవతల లైనులో తారట్లాడుతున్న పప్పు బొక్కెన కుర్రాడికి ఈ కేక వినపడీ వినపడనట్లు వినపడి ‘ఎక్కడా... ఎక్కడా... పప్పు... పప్పు...’ అంటూ అందర్నీ విసిగిస్తూ అటూ ఇటూ ఆ లైనులోనే తచ్చాడుతాడుగానీ, ఈ లైనులోకి రానేరాడు. ఇంక ఈ పులుసు బొక్కెన వాడు భరించలేక పులుసు బొక్కెన అక్కడే కింద పెట్టేసి పరుగెత్తుకుంటూ వెళ్ళి ‘ఒరే పప్పు సుద్దా పిలుస్తుంటే వినిపించుకోవేం?’ అని వాడి చేతిలోంచి పప్పు బొక్కెన లాక్కుని వి.ఐ.పి. సీటు దగ్గరకు వెనక్కి వస్తాడు. ఇది జరిగే లోపల పప్పు బొక్కెన నెం.2 వాడు వెనక లైన్లో నుంచి వరసలో వచ్చి వి.ఐ.పి.కి పప్పు వడ్డించడంతోపాటు అక్కడే ఉన్న పులుసు బొక్కెన లోంచి కాస్త పులుసు కూడా వడ్డించేసి చక్కా జారుకుంటాడు. ఇంక వి.ఐ.పి.కి వడ్డించడానికి అవకాశం కోల్పోయిన పులుసువాడు నిరుత్సాహపడిపోయి, పులుసు బొక్కెన వదిలేసి, నిరాసక్తంగా సాల్ట్ ప్యాకెట్ పట్టుకు తిరగాల్సిందే! పోన్లే పప్పు కాకపోతే ఉప్పైనా వడ్డించామని సరిపెట్టుకోవాల్సిందే. ఇట్లాంటి వడ్డన షోరాయుళ్ళు వి.ఐ.పి.కు కావలసిన అప్పడం కోసం కూడా అందర్నీ కేకలేసి దాన్నో అంతర్జాతీయ సమస్య కింద ఫీలై పోయి గందరగోళం సృష్టిస్తారే తప్ప ఒక్క నిమిషం కూడా తామే వెళ్ళి ఆ పప్పో, అప్పడమో తెచ్చి వెయ్యరు.
అందుకనే ఈ రొస్టూ వేస్టూ ఎందుకని కొందరు బడా బాఋలు ఏ హోటల్‌కో వంటకీ వడ్డనకీ కూడా కలిపి కాంట్రాక్టు ఇచ్చేసి కులాసాగా తిరుగుతారు. వాళ్ళైతే పట్టీ పాంట్లు, గాంధీ టోపీలు ధరించి, మిలిటరీ డిసిప్లెన్‌తో ఒక వడ్డన ఇన్‌ఛార్జి ఆదేశాల మేరకు, ఆవేశపడకుండా ముక్కుసూటిగా రూట్ మార్చ్ చేసుకుంటూ ఐదు పది నిమిషాల్లో ఒక్కో బేచ్‌ని లాగించి పారేస్తారు. ‘విస్తరికి ఇంత’ అని ఛార్జి చేస్తారు కాబట్టి ‘విస్తట్లో ఎంత’ అనే మీమాంస ఉండదు. కాబట్టి గెస్టు సుష్టుగా తిన్నాడా లేదా అనేది అనవసరం వీళ్ళకి. ఈ రకమైన ప్రొఫెషనల్ ఆర్టిస్టులు... అంటే ‘వృత్తి వడ్డన కళాకారుల’ వల్ల లార్జ్ స్కేల్ ఎకానమీస్ ఉంటాయి. తక్కువ పదార్థాలతో ఎక్కువ మందికి తక్కువ టైములో వడ్డించగల చాకచక్యం వీళ్ళకికాక మరెవరికి ఉంటుంది చెప్పండి? ఈ వృత్తి కళాకారులు అన్నీ వడ్డిస్తారు, కానీ ఏది కనపడదు. అన్నీ సింపుల్‌గా శాంపుల్స్ వేస్తారు. పిలిచినా వినిపించుకోరు, వినిపించుకున్నా వెనక్కి రారు. రైలు పెట్టెల్లాగా ఒకడి వెనక మరొకడు తరుముకొస్తుంటాడు గనక వీళ్ళు ‘సింగిల్ ట్రాక్ వడ్డన సిస్టమ్’ని అవలంబిస్తారని చెప్పొచ్చు.
బఠానీలు వేసిన వంకాయ కూరను, ముచ్చటగా మునివేళ్ళతో పట్టుకుని ముప్ఫయ్ విస్తళ్ళకు సర్దగల సామర్ధ్యం వీళ్ళకే చెల్లుతుంది. ఒక విస్తట్లో రెండు బఠానీ గింజలూ, రెండో విస్తట్లో కాస్త గుజ్జూ, మూడో విస్తట్లో ఒకటో అరో వంకాయ ముక్కా ఉంటుంది. కేబేజీ కూరా అంతే.. కూరలన్నీ కలిపి కూడగట్టుకుని నోట్లో కుక్కుకునే లోపల గిన్నెకి చెంచా కొట్టుకుంటూ... నెయ్యి ఏ విస్తట్లోనూ పడకుండా జాగ్రత్త వహిస్తూ మరొకడు! వాడి వెంట ‘చుర్రుమని కాలే’ సాంబారువాడు (ఛ.. ఛ.. కాలేది సాంబారువాడు కాదు..సాంబారే) అడక్కపోయినా అన్నం మీద పోసేసి జారుకుంటాడు. ఇలా అందరూ ఒకళ్ళకొకళ్ళు అతుక్కుని వచ్చేసి, ఏదీ తినే టైమివ్వరు. సాంబారు ఒళ్ళో జారుతుందేమోనని విస్తరి ఎడం చేత్తో ఓ మూల ఎత్తి పట్టుకుని ఊదుకుండే లోపల డేటు అయిపోయిన లాటరీ టిక్కెట్లలో పార్సిల్ కిళ్ళీలు పట్టుకుని, ఎడం చెయ్యి లాక్కుని అందులో కిళ్ళీ బలవంతాన రహస్యంగా (గుమాస్తాకు లంచం ఉంచిన రీతిలో) చేతిలో వేసి గుప్పిట మూసి మరీ వెళ్ళిపోతాడు నెక్స్ట్ సర్వేశ్వరుడు. ఎడం చేతికి ఎంగేజ్‌మెంట్ దొరికి విస్తరి వదిలెయ్యటంతో సాంబారు ఒళ్ళో జారి, కంగారుపడి దులుపుకుని తేరుకునేలోపల సాంబారన్నం మీద తెల్లపెరుగు ప్రత్యక్షం! ఇదేమిటబ్బా! అని ఆశ్యర్యపడేలోప అందరూ లేచి వెళ్ళి చేతులు కడుక్కుంటూ ఉంటారు. మనం కూడా లేచి వెళ్ళకపోతే అన్నం తింటానికి అయిదు నిమిషాలు పట్టినా, చేతులు కడుక్కునే క్యూ దగ్గర అరగంట పట్టచ్చు. ఇదీ సర్వారాయుళ్ళ సామూహిక వడ్డన కళ యొక్క సంగ్రహ చరిత్ర.
‘వడ్డన కళ’ అంటే... ఎవరు ఏంకావాలని ఎప్పుడడిగినా ‘అలాగే అలాగే’ అని నవ్వుతూ చేపట్టిన వస్తువునీ, అగుడుపెట్టిన వరసనీ మార్చకుండా వరుస క్రమం తప్పకుండా వడ్డించటమే. ‘సామూహిక’ వడ్డనలో ‘సామాజిక’ సూత్రాలు పాటించాలేగానీ, వ్యక్తిగత సుష్టు భోజనాలకు తావులేదనీ, స్వతంత్ర వడ్డనలు పనికిరావనే నగ్న సత్యాన్ని గ్రహించిన వాడే ఒక ఉత్తమ వడ్డన కళాకారుడు కాగలడనేది నా విశ్వాసం!
అన్న దాతా సుఖీభవ! వడ్డన కళా వరదోభవ!